పెండ్లి బస్సును ఢీకొట్టిన లారీ  ఒకరి మృతి, 15 మందికి గాయాలు

పెండ్లి బస్సును ఢీకొట్టిన లారీ  ఒకరి మృతి, 15 మందికి గాయాలు

నిజాంపేట, వెలుగు : పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేట్​బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో 765 డీజీ నేషనల్​హైవేపై జరిగింది. సిద్దిపేట జిల్లా పాలమాకులకు చెందిన చేర్యాల విజయ్ హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ ఎస్​ఐగా పనిచేస్తున్నాడు. బుధవారం మెదక్​లో అతడి పెండ్లి ఉండగా, బంధువులు రెండు ట్రావెల్ బస్సుల్లో బయలుదేరారు. ఒక బస్సు మెదక్ కు చేరుకోగా.. రెండో బస్సును రామాయంపేట నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొంది. పెండ్లి బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను, లారీ స్టీరింగ్ లో ఇరుకున్న లారీ డ్రైవర్ ను స్థానికులు కష్టం మీద బయటకు తీశారు. లారీ డ్రైవర్, ట్రావెల్ డ్రైవర్ తో పాటు, పెండ్లికి వెళ్తున్న బంధువుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 10 మందికి స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని  ట్రీట్​మెంట్​కోసం సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. గాయపడ్డ లింగయ్య (60) చికిత్స పొందుతూ మృతి చెందగా, ఆయన భార్య, కూతురు పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని రామాయంపేట సీఐ వెంకటేశ్, నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, భూంపల్లి ఎస్ఐ భువనేశ్వర్ పరిశీలించారు.